ప్రైవేటు మెడికల్ కాలేజీలలో చదువు ఒక పెద్ద ప్రహసనం అని చాలా మందికి తెలుసు.చదువు చెప్పే ప్రొఫెసర్లనుంచి,వచ్చే పేషంట్ల వరకు అన్నీ కాకి లెక్కలని జగమెరిగిన సత్యం. సంవత్సరానికి ఒకట్రెండు మార్లు వచ్చే మెడికల్ కౌన్సిల్ ఇనస్పెక్షన్ తతంగం పెద్ద హిట్టైన హాలీవుడ్ సినిమాను మైమరపిస్తుంది! వచ్చే మెడికల్ కౌన్సిల్ ఇనస్పెక్టర్స్ ఏదో దేవ దూతలు అయినట్లు విజిట్ జరిగే మూడు రోజులపాటు అందరు ప్రవర్తిస్తారు. కౌన్సిల్ మెం బర్స్ కూడా ఏదోగా ఫీల్ అయిపోతూ, ముక్కు మీదకు జారే కళ్ళద్దాలతో అందరిని దిగువుగా చూస్తుంటారు, ఎన్ని తప్పులను,లోటుపాట్లను పట్టుకొంటే తమకు అంత లాభము కాబట్టి! పెళ్ళి పీటల మీద పెళ్ళికొడుకు ప్రవర్తనను మించిపోతారు! నానా భ్రష్టు పనులు చేసి సంపాదించిన సదరు కాలేజ్ చైర్మన్, తన తాబేదార్లతో కలసి వ్యుహ ప్రతివ్యుహాలు చేస్తుంటాడు. అంతకు మునుపే ఢిల్లీ లో , మెడికల్ కౌన్సిల్ మెంబర్ల ఇళ్ళకు రాకపోకలు జరిగి వుంటాయి కాబట్టి, ఫైవ్ స్టార్ హోటల్లో లోపాయికారి ముందు ఒప్పందాలు జరిపాడు కాబట్టి, మనసులో నిశ్చింతగా వున్నా, ఎక్కడో మరల భయం పీడిస్తూవుంటుంది, ఎక్కడ ఎవడో ఒకడి మనసు మారుతుందేమొనని. దాంతో తన పెద చెంచా గాడిని కోఆర్డినేటర్ అనే పదంతో పిలిచి డబ్బు వ్యవహారాలను చక్క పెడుతుంటాడు.ఆ చెంచాగాడు డబ్బులను పంచి,నసిగిన వాడికి ఇంకొంత రహస్యంగా విదిలించి,కొంత తన జేబులో వేసుకొంటాడు .
ఇక మెడికల్ కౌన్సిల్ విజిట్ రోజు చూడాలి ప్రహసనం-కనివిని ఎరుగని డాక్టర్ల పేర్లు టక్కున ఆ రోజు కాలేజ్ అంతా ప్రతిద్వనిస్తాయి. సంవత్సరంలో ఒక్క రొజు కూడా చూడని తన కొలీగును చూసి, రోజూ పనిచేసే డాక్టరు ముక్కు మీద వేలేసుకోవలసిందే! ఏ తమిళ్ నాడు నుంచో, కేరళ నుంచో, హింది లాండ్ నుంచో లేక ఒరిస్సా నుంచి, రాత్రికి రాత్రి అందరు ఫ్లైట్లల్లో, ట్రైన్లల్లో దిగుమతి అయిపోతారు! ఇక చూడాలి హడావిడి! వూళ్ళో పెళ్ళి అయితే , అసలు సందడి కుక్కలది అన్నట్లు! ఎక్కడ కౌన్సిల్ మెంబర్స్ ముందు పొరపడుతామోనని, ఒకరినొకరు పరిచయం చేసుకొని,రిహార్సల్స్ వేసుకొంటారు! ఎప్పుడూ మూత పడివుండే రూంల పై రక రకాల బోర్డ్లు ప్రత్యక్షమైపోతాయి- అకడెమిక్ రూం అని, డెమాన్స్ట్రేషన్ రూం అని, ప్రొఫెసర్ రూం అని ! ఇంత భారి సెట్టింగులు చూసి అరుంధతి సినిమా నిర్మాత కూడా నేర్చుకోవలసిందే !
అందరి టేబుళ్ళ మీద టీ కాఫీలు, కూల్ డ్రింకులు, ఇంకా మన మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కి ఆల్మండ్స్ మొదలైన రక రకాల డ్రై ఫ్రూట్స్ వికటాట్టహాసం చేస్తుంటాయి! అందరు అప్పుడే గంజి పట్టి,ఇస్త్రీ చేసిన ఏప్రానులతో అటు ఇటు తిరుగుతూ తెగ హడావిడి చేస్తుంటారు.ఇక డబ్బులిచ్చి, చేర్మన్ తండ్రి పరమపదించినందున వుచిత వైద్యమని ప్రలోభపెట్టి, తీసుకొని వచ్చిన పేషంట్లతో వార్డులు తొణికిసలాడుతుంటాయి! చనిపొయినవాళ్లనుకూడా ఎలా వుపయోగించుకోవాలో వీళ్ళను చూసి నేర్చుకోవలసిందే! ఆ సో-కాల్ల్డ్ పేషంట్లను చూస్తే కనీస పరిఙ్నానములేని వాడు కూడా అశ్చర్యపోతాడు-ఇంత బాగున్నవాళ్ళు ఎందుకు బెడ్ల మీద వున్నారని. కాని మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కి మటుకు వాళ్ళు అసలు,సిసలయిన పేషంట్లు. ఇలా ఆ రెండురోజులు గవర్నమెంట్ హాస్పిటల్ని తలదన్నుతూ, బెడ్స్ అన్ని ఫుల్లుగా వుంటాయి. అలా అని,నిజంగా ఈ సో-కాల్ల్డ్ పేషంట్సుకు, నిజంగా ఏ వన్నా టెస్టులు చేస్తారా అంటే ఏమి లేదు-వుత్త ప్రింటర్ పని తప్ప.వుదాహరణకు డయాబెటీస్ లేని వాడికి కూడ వున్నట్లు చూపిస్తారు! రేషన్ బియ్యంతో వాళ్ళకు వడ్డిస్తారు! ఇలా రెండు. మూడు రోజుల పాటు ఈ తంతు జరుగుతుంది.ఎవరి అకౌంట్లలో వాళ్ళ వంతు చేరిన తర్వాత,మెడికల్ కౌన్సిల్ మెంబర్లు, అద్దె ప్రొఫెసర్లు అందరు తిరుగు టపా కట్టేస్తారు! వాళ్లు అలా మాయంకాగానే ఇలా పేషంట్లకు అన్నము పెట్టడము మానేస్తారు. దాంతో వాళ్ళూ బయటపడకతప్పదు. డిస్ప్లే బోర్డులన్ని తిరిగి స్టోర్ రూంకి చేరుతాయి, నెక్స్ట్ విజిట్ కి వుండాలిగా మరి!
ఇవేమి పట్టని విద్యార్దులు కసాయిని నమ్మిన గొర్రెల్లా, హాస్టల్లో బోరు కొట్టినపుడు,హాస్పిటలుకు వస్తుంటారు!
అటు ఇన్ని ఎక్స్ట్రా సీట్లు వస్తాయని కంఫర్మ్ చేసుకున్న చైర్మన్, ఇంకెంత డొనేషన్ లాగాలని ఆనందంతో ఆలోచిస్తుంటాడు. తన కీప్ అయిన బి గ్రేడ్ సినిమా హీరోయిన్ వడిలో విశ్రాంతి తీసుకొంటాడు! కోఆర్డినటర్ ఎలాగూ స్వజాతి ఆకర్షితుడు కాబట్టి చెప్పనవసరము లేదు!
ఇంత మంది ఇలా ఇంత ఆనందంగా వుంటే ఎందుకమ్మా సరస్వతి తల్లీ, అలా రోదిస్తావు?నువ్వు కూడా కళ్ళు మూసుకోవడం నేర్చుకో .
No comments:
Post a Comment