Sunday, December 27, 2009

ఇంద్రుళ్ళు-చంద్రుళ్ళు

1987 లో ఇంద్రుడు-చంద్రుడు సినిమాను చూసి,జనాలు నిర్ఘాంతపోయారు,తెలియని విషయాలు తెలిపినందుకు ఆ సినిమా ను hit చేసారు.ఆ చిత్రంలో తన Mayor పదవిని అడ్డుపెట్టుకొని ఓ middle age politician మంచి రసికుడని నిరూపించుకొంటాడు! ఇందులో మరో High light ఏమిటంటే ఆ mayor వద్ద పనిచేసే secretary తన భార్యను ,చెల్లి అని చెప్పుకొంటూ mayorను ఆమె ద్వారా లొంగదీసుకొని double game ఆడుతాడు.చివరకు తన స్త్రీ లోలత్వానికి mayor బలైపోతాడు. ఆ పాత్ర చేసిన కమల్ హాసన్ సహజ నటన కు ప్రేక్షకులు జేజేలు పలికారు. 1990లలో వచ్చిన కమల్ హాసన్ మరో సినిమా " మహా నది" ఈ politicians చేసే child trafficking,,పిల్లలతో వీళ్ళు చేసే నీతి బాహ్యమైన చర్యలను వెలుగులోకి తీసుకొని వచ్చింది. అలాగే Page 3 సినిమాలో డబ్బుతో పెట్టిపుట్టినవాళ్ళు కొందరు, child sexual abuseకు పాల్పడీ, తమ political nexus తో ఎలా చట్టాన్నుంచి తప్పించుకొంటారో చూపించారు.
ఇదిలా వుంటే, N D Tiwari ఏదో పాపం మన యువత నెట్ మీద, దొంగ సీడీ ల కోసం వెంపర్లాడడము చూసి,ఏదోలే పాపం, పోయే ముందన్నా, free గా రసిక ఫిల్మ్ లు పంచించి కొంత జనసేవ చేస్తామనుకొంటే మన పేపర్లు,టీ వీ న్యూస్ చానళ్ళు అతని దేశ భక్తిని సరిగ్గా గుర్తించక ఆడిపోసుకొన్నాయి! పొర్నో సైట్సును ప్రపంచంలోనే ఎక్కువగా వీక్షించేది మన భారతీయులనేది జగమెరిగిన సత్యం! అలా గంటలు,గంటలు ఎందుకు టైం వేస్ట్ చేసుకొంటున్నారు ఈ నా భారతీయ సహోదరులని,వుడతాభక్తి సహాయంగా మన గవర్నర్ చేయబొయి భంగపడ్డాడు! ఎందుకు చెప్పండి ఈ కాటికి కాళ్ళు చాపుకొన్న వయసులో ఈ సేవ !? ఎక్కడో నిజాయితీగా Tiger Woods నిజం వొప్పుకొంటే ,పత్రికలు ఏకి పారేసాయి ప్రపంచ వ్యాప్తంగా!! అతనితో వున్న వ్యాపార సంబందాలను రద్దు చేసుకొన్నాయి బడా కంపెనీలు. Bill Clinton చేయక చేయక ఒక తప్పు చేస్తే అతని presidency post నే వూడే పరిస్థితి వచ్చింది. మనల్ని చూడండి, మనము ఎంత దొరబాబులమో,మనల్ని మనము ఎంత దులపరించుకొంటామో, ఎంత కుహానా వాదులమో- Cricketలో match fixing కి పాల్పడి,నిజం వొప్పుకొన్న్న South Africa Captain Hansie Cronje చివరకు విమాన ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. అదే పని చేసిన మన అజరుద్దీన్ ఒక రాజకియ నాయకుడి అవతారం లో వున్నాడు. అజయ్ జడేజా TV లలో cricket commentary,expert opinion ప్రొగ్రాములలో నిర్లజ్జగా పాల్గొంటాడు. ఇదంతా చూస్తూవుంటే, నాకు ఒక సందేహం వస్తుంది.నిజంగా నైతిక విలువలు వుండేది మనకా లేక మనం తెగ అవహేళన చేసే తెల్లవారికా?
ఏదో పాపం బద్దలయ్యి,మన పెద్ద వాళ్ళు అనుకొంటున్నట్లు, Tiwari బయటపడ్డాడు గాని,వెలుగు చూడని పెద్ద మనుషులు ఎందరో మన సమాజంలో-గుమ్మడికాయల దొంగ బుజాలు తడుముకొన్నట్లు urgentగా అతనిని సమర్దించిన ఇద్దరు ముసలి MP ల మీద అనుమానము కలుగుతోంది. Coaching centers పెట్టుకొని,తర్వాత రాష్ట్రవ్యాప్తంగా private colleges విద్యావ్యాపారం చేస్తూ,Medical మరియు Engineering colleges ను కలిగివున్న అధినాయకుడి భాగోతాలు క్రిష్ణ లీలలను మించిన లీలలు. రాజకీయ నాయకులకు, అధికారులకు ఇతడు ఓ పెద్ద తార్పుడుగాడు. Platinum పరుపులమీద సినీ నాట్య తారతో సేదతీరుతూ, తనకు అన్నివిధాల సహకరించే ఓ స్త్రీకార్యకర్తను, Mayor చేసి,నల్ల కళ్ళద్దాలతో, TV మీద తెగ హడావిడి చేస్తాడు-ఓ సీనియర్ MLA. శివలింగాలకు TVలలో పూజ చేస్తూ ,తన కామ లింగాన్ని సంత్రుప్తి పరచుకొనేవాడు ఓ MP. గవర్నరును తెగ విమర్శించిన ఓ పార్టీ నాయకుడి,ఇప్పుడు UP MP అయిన ఓ మాజీ సినీ తారతో నడిపిన భాగోతం రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు. అధికారంలో ఎవరువుంటే వాళ్లకు చెంచాగిరి చేసి,ఏకధాటిగా పది సంవత్సరాలు తిరుపతిలో ఓ హాస్పిటల్ Head గా ఏడుకొండలవాడి డబ్బు కాజేసిన ఓ doctor స్త్రీల వ్యవహారములలో మరో పెద్దమనిషి. అవును మరి,దొరకనివాడు దొరే! చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి గా వున్న మధు కోడా, ప్రజల డబ్బును సెలీనా జైట్లీ,కొయినా మిత్రాల ఆర్దిక పరిస్తితి చూసి చలించి వారికి పంచడం చూసి,అతని జాలి గుండె కు జనాలు ఆనందంతో కన్నీళ్ళు పెట్టారు!
ఈ విషయాలన్ని ముందే బహిర్గతమైవుంటే పూరీ జగన్నాధ్ తన " పొకిరి" లో ముమైత్ ఖాన్ పాట ఇలా పాడించే వాడేమో-"ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ,చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ MP,MLA లే,వాళ్ళ చెంచాగాళ్ళూ నన్ను వదలట్లే. తివారీకి నేను ఒక్కటే చాలట్లే, మరో ఇద్దరు తోడుండాలే " !!!

Wednesday, December 2, 2009

వైద్యో "నారాయణో" హరి !

ప్రైవేటు మెడికల్ కాలేజీలలో చదువు ఒక పెద్ద ప్రహసనం అని చాలా మందికి తెలుసు.చదువు చెప్పే ప్రొఫెసర్లనుంచి,వచ్చే పేషంట్ల వరకు అన్నీ కాకి లెక్కలని జగమెరిగిన సత్యం. సంవత్సరానికి ఒకట్రెండు మార్లు వచ్చే మెడికల్ కౌన్సిల్ ఇనస్పెక్షన్ తతంగం పెద్ద హిట్టైన హాలీవుడ్ సినిమాను మైమరపిస్తుంది! వచ్చే మెడికల్ కౌన్సిల్ ఇనస్పెక్టర్స్ ఏదో దేవ దూతలు అయినట్లు విజిట్ జరిగే మూడు రోజులపాటు అందరు ప్రవర్తిస్తారు. కౌన్సిల్ మెం బర్స్ కూడా ఏదోగా ఫీల్ అయిపోతూ, ముక్కు మీదకు జారే కళ్ళద్దాలతో అందరిని దిగువుగా చూస్తుంటారు, ఎన్ని తప్పులను,లోటుపాట్లను పట్టుకొంటే తమకు అంత లాభము కాబట్టి! పెళ్ళి పీటల మీద పెళ్ళికొడుకు ప్రవర్తనను మించిపోతారు! నానా భ్రష్టు పనులు చేసి సంపాదించిన సదరు కాలేజ్ చైర్మన్, తన తాబేదార్లతో కలసి వ్యుహ ప్రతివ్యుహాలు చేస్తుంటాడు. అంతకు మునుపే ఢిల్లీ లో , మెడికల్ కౌన్సిల్ మెంబర్ల ఇళ్ళకు రాకపోకలు జరిగి వుంటాయి కాబట్టి, ఫైవ్ స్టార్ హోటల్లో లోపాయికారి ముందు ఒప్పందాలు జరిపాడు కాబట్టి, మనసులో నిశ్చింతగా వున్నా, ఎక్కడో మరల భయం పీడిస్తూవుంటుంది, ఎక్కడ ఎవడో ఒకడి మనసు మారుతుందేమొనని. దాంతో తన పెద చెంచా గాడిని కోఆర్డినేటర్ అనే పదంతో పిలిచి డబ్బు వ్యవహారాలను చక్క పెడుతుంటాడు.ఆ చెంచాగాడు డబ్బులను పంచి,నసిగిన వాడికి ఇంకొంత రహస్యంగా విదిలించి,కొంత తన జేబులో వేసుకొంటాడు .
ఇక మెడికల్ కౌన్సిల్ విజిట్ రోజు చూడాలి ప్రహసనం-కనివిని ఎరుగని డాక్టర్ల పేర్లు టక్కున ఆ రోజు కాలేజ్ అంతా ప్రతిద్వనిస్తాయి. సంవత్సరంలో ఒక్క రొజు కూడా చూడని తన కొలీగును చూసి, రోజూ పనిచేసే డాక్టరు ముక్కు మీద వేలేసుకోవలసిందే! ఏ తమిళ్ నాడు నుంచో, కేరళ నుంచో, హింది లాండ్ నుంచో లేక ఒరిస్సా నుంచి, రాత్రికి రాత్రి అందరు ఫ్లైట్లల్లో, ట్రైన్లల్లో దిగుమతి అయిపోతారు! ఇక చూడాలి హడావిడి! వూళ్ళో పెళ్ళి అయితే , అసలు సందడి కుక్కలది అన్నట్లు! ఎక్కడ కౌన్సిల్ మెంబర్స్ ముందు పొరపడుతామోనని, ఒకరినొకరు పరిచయం చేసుకొని,రిహార్సల్స్ వేసుకొంటారు! ఎప్పుడూ మూత పడివుండే రూంల పై రక రకాల బోర్డ్లు ప్రత్యక్షమైపోతాయి- అకడెమిక్ రూం అని, డెమాన్స్ట్రేషన్ రూం అని, ప్రొఫెసర్ రూం అని ! ఇంత భారి సెట్టింగులు చూసి అరుంధతి సినిమా నిర్మాత కూడా నేర్చుకోవలసిందే !
అందరి టేబుళ్ళ మీద టీ కాఫీలు, కూల్ డ్రింకులు, ఇంకా మన మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కి ఆల్మండ్స్ మొదలైన రక రకాల డ్రై ఫ్రూట్స్ వికటాట్టహాసం చేస్తుంటాయి! అందరు అప్పుడే గంజి పట్టి,ఇస్త్రీ చేసిన ఏప్రానులతో అటు ఇటు తిరుగుతూ తెగ హడావిడి చేస్తుంటారు.ఇక డబ్బులిచ్చి, చేర్మన్ తండ్రి పరమపదించినందున వుచిత వైద్యమని ప్రలోభపెట్టి, తీసుకొని వచ్చిన పేషంట్లతో వార్డులు తొణికిసలాడుతుంటాయి! చనిపొయినవాళ్లనుకూడా ఎలా వుపయోగించుకోవాలో వీళ్ళను చూసి నేర్చుకోవలసిందే! ఆ సో-కాల్ల్డ్ పేషంట్లను చూస్తే కనీస పరిఙ్నానములేని వాడు కూడా అశ్చర్యపోతాడు-ఇంత బాగున్నవాళ్ళు ఎందుకు బెడ్ల మీద వున్నారని. కాని మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కి మటుకు వాళ్ళు అసలు,సిసలయిన పేషంట్లు. ఇలా ఆ రెండురోజులు గవర్నమెంట్ హాస్పిటల్ని తలదన్నుతూ, బెడ్స్ అన్ని ఫుల్లుగా వుంటాయి. అలా అని,నిజంగా ఈ సో-కాల్ల్డ్ పేషంట్సుకు, నిజంగా ఏ వన్నా టెస్టులు చేస్తారా అంటే ఏమి లేదు-వుత్త ప్రింటర్ పని తప్ప.వుదాహరణకు డయాబెటీస్ లేని వాడికి కూడ వున్నట్లు చూపిస్తారు! రేషన్ బియ్యంతో వాళ్ళకు వడ్డిస్తారు! ఇలా రెండు. మూడు రోజుల పాటు ఈ తంతు జరుగుతుంది.ఎవరి అకౌంట్లలో వాళ్ళ వంతు చేరిన తర్వాత,మెడికల్ కౌన్సిల్ మెంబర్లు, అద్దె ప్రొఫెసర్లు అందరు తిరుగు టపా కట్టేస్తారు! వాళ్లు అలా మాయంకాగానే ఇలా పేషంట్లకు అన్నము పెట్టడము మానేస్తారు. దాంతో వాళ్ళూ బయటపడకతప్పదు. డిస్ప్లే బోర్డులన్ని తిరిగి స్టోర్ రూంకి చేరుతాయి, నెక్స్ట్ విజిట్ కి వుండాలిగా మరి!
ఇవేమి పట్టని విద్యార్దులు కసాయిని నమ్మిన గొర్రెల్లా, హాస్టల్లో బోరు కొట్టినపుడు,హాస్పిటలుకు వస్తుంటారు!
అటు ఇన్ని ఎక్స్ట్రా సీట్లు వస్తాయని కంఫర్మ్ చేసుకున్న చైర్మన్, ఇంకెంత డొనేషన్ లాగాలని ఆనందంతో ఆలోచిస్తుంటాడు. తన కీప్ అయిన బి గ్రేడ్ సినిమా హీరోయిన్ వడిలో విశ్రాంతి తీసుకొంటాడు! కోఆర్డినటర్ ఎలాగూ స్వజాతి ఆకర్షితుడు కాబట్టి చెప్పనవసరము లేదు!
ఇంత మంది ఇలా ఇంత ఆనందంగా వుంటే ఎందుకమ్మా సరస్వతి తల్లీ, అలా రోదిస్తావు?నువ్వు కూడా కళ్ళు మూసుకోవడం నేర్చుకో .

Tuesday, September 22, 2009

మనిషిని తప్పుడు త్రోవను పట్టించేవన్నీ కలగలిసినపుడు

మనమందరము చిన్నపుడు కామ,క్రోధ,లోభ,మద మరియు మాత్స్యర్యములనేవి అరిషడ్వర్గములని చాలా మార్లు చదివివుంటాము.కాని వయసు వచ్చేకొద్దీ అదేమి ఖర్మమో మన విషయ బుద్ధి వికసించి,ఙ్నాన బుధ్ధి క్షీణించడం మొదలవుతుంది. ఒక మగాడు నాశనం అయ్యే కారణాలలో ముఖ్యమైనది స్త్రీ పిచ్చి అని నా నమ్మకము. కావాలంటే పరిశీలనగా చూడండి పై మొదటి వాక్యాన్ని, ఐదు లక్షణాలలో దేనికి మన పూర్వీకులు మొదటి ప్రాముఖ్యతను ఇచ్చారో. ఎంత వారలమైనా కాంత దాసులమే అన్న నానుడిని నిజం చేస్తూ, ఎంతో ఎదగవలసిన మగాడు అధఃపాతాళానికి జారి పోతాడు.నీచమైన పనులు చేస్తూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి చందాన ప్రవర్తిస్తుంటాడు.అదేమంటే తన టెన్షన్ ను అలా రిలీవ్ చేసుకొంటుంటానని బుకాయిస్తుంటాడు! లారీ డ్రైవర్ టెన్షన్ లారీ డ్రైవర్ ది మరి,ఎక్కడ ఏక్సిడెంట్ చేస్తానేమోనని, అలాగే డబ్బులు సంపాదించేవాడి టెన్షన్ వాడిది, ఇంకా ఎక్కువ సంపాదించాలని మరియు వున్నది ఎక్కడ పోతుందేమోనని. అధికారంలో వున్నవాడికి అదే తంటా మరియు అది తెచ్చే టెన్షన్. ఇలా వీళ్ళు అందరూ ఒకే చందాన చీకటి వేళకు రిలాక్సేషన్ కోసం ప్రయిత్నిస్తారు,స్థలాలు మారుతాయి అంతే తేడా! దీనికి చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. నాటి రావణాసురుడు,ఇంద్రుడు,కీచకుడు,బాల నాగమ్మ ను మోహించిన మాయల ఫకీర్ నుంచి నేటి బిల్ల్ కింటన్, రామారావు, సిల్వియొ బెర్లుస్కోని, మా ఎం ఎల్ ఎ, నికొలాస్ సార్కోజీ,నారాయణ ఇలా ఎందరో. బయిటపడని ఘటికులు గూర్చి చెప్పనవసరములేదు. ఫైనల్ గా అర్ధమైనది ఏమిటంటే క్రోధం లేక లోభం కానివ్వండి. మద,మాత్సర్యాలు కానివ్వండి.చివరకు ఇవి కూడినపుడు వుద్భవించేది కామం అనే మహా వినాశనహేతువు. పోనీ ఇలా బ్లాగులలో చూస్తామా ,ఆహ,ఓహో అంటూ కొన్ని స్త్రీల బ్లాగులను కామెంట్లతో ముంచెత్తే భట్రాజులు.

Sunday, September 20, 2009

గుణం లేని చోట పని చేయడం

ఒక వుద్యోగము అంటే అది పని చేసేవాళ్ళు మరియు పని చేయించుకొనేవాళ్ళ మధ్య వుండే interaction.Mutual understanding మీద ఆధారపడిన వాతావరణం. అది చెడిందంటే చాలా సంధర్బాలలో కారణం, ఇరువైపుల వుంటుంది. ముఖ్యంగా పని ఎక్కువలేనిచోట, దెయ్యాలు నాట్యం చేస్తుంటాయని నానుడి. ఒక వ్యక్తి దగ్గర డబ్బులుంటాయని చూచాయిగ తెలిస్తే చాలు ,పందికొక్కులు చేరి పోతాయి. మరల వాటిల్లొనే వాటికి పడవు! ఒక దానితో ఒకటి కలహించుకొంటుంటాయి. ఏ పందికొక్కు యజమాని ప్రాపకం బాగా పొందుతుందో, అది మిగిలిన వాటిని తరిమేయాలని చూస్తుంటుంది. ఇటువంటి గాదె క్రింద పోరాటాలు middle management levelలో బాగా చూడవచ్చు.
కాని పెదపంది కొక్కుకి ఎప్పుడూ అభధ్రతా భావం వుంటుంది, ఎక్కడనుంచి మిగిలిన వాటినుంచి ప్రమాదం ముంచు కొస్తుందోనని! దాంతో దానికి ప్రపంచంలో ప్రతిఒక్కటి అనుమానాస్పదం గా కనబడడం మొదలవుతుంది.ఎక్కడన్న ఏదైన తనను లక్ష్యపెట్టడం లేదని తోస్తే, తన వునికికే ప్రమాదం వస్తుందన్న అనుమానంతో ఎటువంటి క్రూరపు పనైనా చేయడానికి వెనుకాడదు. అటు వంటి చోట్ల, ఉద్యోగం కోసం చేరిన వాళ్ళ నిత్యావస్థలు చెప్పనలవి కాదు.అటు పెద పందికొక్కుతో వేగలేక, మిగిలిన పందికొక్కుల తో కూడ వుండలేక గిల గిల కొట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. కొంతమంది చూసి చూసి చివరకు,ఆ సమూహం లో కి metamorphosis అవుతారు!

Tuesday, July 8, 2008

ఓటేయండి!!!!

ఇదేదో ఎన్నికల అభ్యర్దన అనుకొనేరు!!! కానే కాదు.దానికి వేరేవాళ్ళు వున్నార్లేండి!.
ఇంతకి ఈ విన్నపము దేనికంటే నా పూర్వ బ్లాగులో మా నెల్లూరు గూర్చి మాట్లాడుతున్నపుడు రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు ఏది Dust bin of Andhra Pradesh అన్న విషయంలో నాతో పోటీపడ్డారు...ఏలూరు నంబర్ ఒన్ అని! అప్పుడు నాకు తోచింది,ఇది ఎలాగు ఎన్నికల కాలము కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా solution వెతుకుదామని, మన రాష్ట్రంలో అన్నీ వూళ్ళ మద్య పోటీ పెడితే బాగుంతుందని!! ఈ Online election లో పాల్గొని విరివిరి గా మీ అమూల్యమైన వోట్లను వేసి పరిష్కరించప్రార్ధన(Comments section లో మీ వోటు వేయ మనవి)!!! ఫలితాలలో ఏ వూరుకు ఎక్కువ వోట్లు పడుతాయో దానిని విజేతగా ప్రకటించుదాము!!!!

Monday, July 7, 2008

సొగసు చూడతరమా!!!!






















వెల్ కం టు నెల్లూర్.
మా వూరికి రండి.మా ప్రగతిని చూడండి.మా వున్నతనాన్ని ఆస్వాదించండి.మా వూళ్ళొ మీకు చాలా వుచితంగా దొరుకుతాయి!టీబి,డయేరియా,టైఫాయిడ్,ఫైలేరియ తో పాటు ఐరన్ ఓర్ వల్ల కలిగే వింత వ్యాది కూడ విరివిరిగా లభిస్తుంది.కడప జిల్లానుంచి వచ్చే ఐరన్ ఓర్ లారీల వలన ఎంతో మంది వ్యాదుల బారిన పడుతుంటే,రహదారులు చిద్రమవుతుంటే నాకేమిటి,నేను నా ఇల్లు సుఖంగా వుంటే చాలు అన్న మనస్తత్వం మాది.ఇంత భారీ ప్రాజెక్టు సాగుతుంటే దానికి తగ్గ వసతి (కడప నుంచి క్రిష్ణపట్నం వరకు) ప్రత్యేక రోడ్ వేయాలని ప్రభుత్వం మర్చిపోగా, దానిని గుర్తు చేయాల్సిన మేము "తిన్నామా, పడుకొన్నామా,తెల్లారిందా" అనే దానిని తూ చా తప్పకుండా అమలుపరుస్తునాము!ఇళ్ళు కట్టడము,పిల్లలను చదివించడము,డబ్బు వెనుక పోగేసుకోవడం అనే మూడిటి నుంచిబయటపడని అచ్చమైన తెలుగు వారం మనము!ఈ మూడు తప్ప మరేదైన వున్నతమైనది ఈ లోకంలో వున్నదా అనే ఆలోచనను కట్టిపడవేసాం!ఈ సంకుచిత్వ భావాల ప్రతిబింబమే మన రాజకీయనాయకులు మరియు అధికారులు.వాళ్ళని ఆడిపోసుకుని ప్రయోజనము ఏమున్నది?ఇంత నేరో మైండెడ్ మెంటాలిటీ వున్నంతవరకు మన దేశం పురోగమించదు.మనకు ప్రతిరూపమైన ,మా నేరో రోడ్స్ ని చూడండి!
పచ్చదనం కానరాక,కాల్చేస్తున్న ఎండలతో సహజీవనం చేస్తాం! కొద్దిపాటి వర్షానికే మురుగుకాలువ నీళ్ళు భేదాపరాలు లేకుండా అంతా చేరుతాయి!గుంటనో మిట్టనో కానరాదు.అయినా ఫర్వాలేదు.పడిలేచి బురదను వాషింగ్ మెషిన్ లో వేస్తాం!రోడ్డు మీదనే యదేచ్చగా వుమ్మేస్తుంటాము,గోడ దొరికితే పాసులు పోస్తుంటాము!మన వాహనాన్ని ఎక్కడైన ఆపగలము,వెనుక బస్సులుఇతరత్రా హారను కొడుతున్నా!అదే దుమ్ము గాలిని ఆస్వాదిస్తూ,టీ తాగి,ప్లాస్టిక్ కప్ ని రోడ్ మీద పడవేస్తాం!స్వార్దానికి నిలువెత్తు ప్రతిరూపాలు,మన తెలుగు వాళ్ళము.పుస్తకాలలోని నీతులు పిల్లవాళ్ళకు చెప్పినా,వాళ్ళు సహజంగా మన చర్యలను గమనించి ముసలి వయసులో నిర్లక్ష్యం చేస్తే మరల అదే-తిన్నామా,పడుకొన్నామా......!!!!!
(పిక్చర్స్ వరుసగా ( పైనుంచి కిందకు) ఐరన్ ఓర్ లారీలతో కళకళ లాడుతున్న, అత్యద్బుతమైన హరనాదపురం-రామలింగాపురం సర్వేపల్లి కాలువ రోడ్డు మరియు బ్రిడ్జి!!! జూలై 8,2008 నాడు ఈనాడులో ని వార్త )

Saturday, July 5, 2008

వెర్రి వేయి రకాలు

నెల్లూరు ప్రజలకు, ఒకరెవరన్నా ఓ లాభసాటి పని అని చేపడితే అంధరూ పొలోమని దాని వెనుకే పడే అలవాటుంది. గత సంవత్సరం వరకు రొయ్యల వ్యాపారమని పచ్చని పొలాలను మాయం చేసారు.వంద మందిలొ ఓ ఐదుగురు లాభపడగా మిగిలినవారు బోర్డు తిప్పేశారు.ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఇబ్బడి ముబ్బడి గా భూముల ధరలు పెంచేసారు.ఇటువంటి వ్యాపారానికి కావలసింది బాగా గాలి వార్తలు (పుకార్లు) పుట్టించడము-అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.ఫలాన వూళ్ళో అంకణం ఇంత రేటంటే అంత రేటని ,వున్న రేటుకు పదింతలు చేసి కూర్చున్నారు. ధరలు మరింత పెరుగుతాయన్న భయం తో ఈ మాయ మాటలకు మోసపోయి ఆదరాబాదర ఎక్కువ రేటుకు కొనుక్కొని వాటిని తిరిగి అమ్ముకోలేని స్థితి దాపురిస్తున్నది. ఆదివారమయితే చాలు,ఈ మధ్య కొత్త తరగతి ఒకటి రోడ్ల ప్రక్కన కనబడుతున్నది.వీళ్ళ పని ఏమిటంటే ఖాళీ స్థలాలు ఎక్కద కనబడితే వాటిని తెరిపారాచూడడము,వాటితో బిజినెస్ చేసినట్లు( తమని తాము ఏ జనచైతన్య ఓనర్ లాగా) ఫీల్ కావడము. ఇద్దరినుంచి పది మంది వరకు గుంపులుగా మోటరు సైకిళ్ళు వేసుకొని తిరుగుతూ సిగరెట్టు పాకెట్టు అయిపోయినదాక మాట్లాడుతూ గుట్కాలు నములుతూ,వూస్తూ అప్పుడే కోటీశ్వరులు అయిపోయినట్టు కలల సామ్రాజ్యంలో విహరిస్తుంటారు !వీళ్ళకు రాజధాని రియాల్టర్లు ఆదర్శము! నెల్లూరు లాంటి మూడో తరగతి కార్పొరేషనులో బాగా సంపాదించేసి,జిల్లా లో పలుకుబడిగల వ్యక్తిగా హైద్రాబాద్ లో అడుగు పెట్టాలని కలలు కంటుంటారు. ఒక వూరు కొంచమన్నా బాగుపడాలంటే నాగరికతకు చిహ్నాలు అనబడిన రోడ్స్ బాగుపడాలి. నెల్లూరు లోని రహదారులలో ఒకసారి తిరిగితేచాలు,మనకు నిస్సందేహముగా నమ్మకము కలుగుతుంది,ఇంకా మనము రాతి యుగములోనే వున్నామని.దశాబ్దాలకొలది విస్తరణకు నోచుకోని ట్రంకు రోడ్డు,చిన్న బజారు,చెత్తతో నిండిన ఇరుకైన వీధులు,కనకమహలు సెంటర్,హరనాదపురము,ఏది చెప్పుకొన్నా ఏమున్నది గర్వకారణము.ఇదంతా చూస్తుంటే పాత సామెత గుర్తుకొస్తోంది-వుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగురుతా అన్నట్లు.ఆర్దిక పరంగా ఒక వ్యక్తి సొంత ఇల్లు అని కట్టుకోవాలంటే వస్తున్న సంపాదనలో కొంత మిగులు చేసేటట్లు వుండాలి.పెరుతున్న చమురు ధరలు,వంటసామానులు,పిల్లల చదువులకే సంపాదనంతా హరించుకుపోతుండగా,ఇలా తామకు తాము రేట్లను పెంచేసుకోవడము తమ గొయ్యి తామే తీసుకొంటున్నట్లు. షార్ట్ టెర్మ్ గెయిన్స్(కమిషన్ (పర్సంటేజులకు)) కు ఆశ పడి రియాల్టర్ల చేతుల్లో మోసపోవడము తప్ప మరేదికాదు ఇది . మింగ మెతుకు లేదు,మీసాలకు సంపంగి నూనె అన్న సామెతను ఋజువు చేస్తున్న నా నెల్లూరు ప్రజలకు రియల్ ఎస్టేటు ప్రభంజనం అన్న భూతాన్నుంచి నుంచి విముక్తి కలగాలని ప్రార్ధిస్తూ సెలవ్